: నిరసనలతో అట్టుడుకుతున్న తమిళనాడు... స్టాలిన్ పై కేసు
తమ నేత స్టాలిన్ పై అసెంబ్లీలో దాడి జరగడం, ఇందులో ఆయన చొక్కా చిరిగిపోవడాన్ని చూసి తట్టుకోలేని డీఎంకే శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగడంతో, తమిళనాడు నేడు అట్టుడుకుతోంది. చెన్నైతో పాటు ఈరోడ్, తిరుచ్చి, కోయంబత్తూరు, నామక్కల్, తిరునల్వేలి తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున డీఎంకే కార్యకర్తలు రహదారుల దిగ్బంధానికి దిగడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భారీఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. సున్నిత ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
అన్నాడీఎంకే శాసనసభ్యుల ఇళ్లపై దాడులు జరగవచ్చన్న అంచనాలతో బందోబస్తును పెంచారు. కాగా, నిన్న మెరీనా బీచ్ లో ధర్నాకు దిగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేందుకు కారణమైనారన్న అభియోగాలతో స్టాలిన్ పై కేసు పెట్టిన పోలీసులు ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. నిన్న సముద్ర తీరానికి భారీగా డీఎంకే కార్యకర్తలు రావడంతో స్టాలిన్ కు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించి వేసిన పోలీసులు నేడు కేసు పెట్టినట్టు వెల్లడించడం గమనార్హం.