: ఇక ప్రజా కోర్టుకు... పన్నీర్ కొత్త ఎత్తుగడ!
ప్రజా మద్దతు ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో విఫలమైన పన్నీర్ సెల్వం, ఇక ప్రజా కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. స్పీకర్ తనతో సహా తన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే, ఆపై ఎన్నికలకు వెళ్లాలని, లేకుంటే రాజీనామా చేసి అయినా ప్రజా తీర్పును కోరాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అందుకోసం చకచకా పావులు కదుపుతున్న ఆయన ఇప్పటికే అమ్మాడీఎంకే పేరిట ఓ కొత్త పార్టీని ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ప్రజల మద్దతు తనకే ఉందని నిరూపించడమే తమ ఉద్దేశమని పన్నీర్ వర్గం నేతలు అంటున్నారు. ఇదే సమయంలో ఎన్నికలు జరిగితే, ప్రజలు అన్నాడీఎంకే పోటీదారులను గెలిపిస్తారని, అమ్మ పార్టీని మోసం చేసిన పన్నీర్ సెల్వం వర్గాన్ని ప్రజలు చీకొడతారని పళనిస్వామి వర్గం నేత ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో అసెంబ్లీలో బల నిరూపణ పర్వం ముగిసినప్పటికీ, తమిళ రాజకీయాలు ఆసక్తిని కలిగిస్తూనే ఉన్నాయి.