: తమిళనాడులో 13 నియోజకవర్గాల్లో త్వరలో ఎన్నికలు!
తమిళనాడులో త్వరలో 13 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం, సహా మరో 11 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడగానే, ఎన్నికలకు పోయి ప్రజా క్షేత్రంలో తీర్పు కోరాలని పన్నీర్ వర్గం భావిస్తోంది.
ఇక ఇదే సమయంలో జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై పరిధిలోని ఆర్ కే నగర్ లోనూ ఎన్నికలు జరుగుతాయని అంచనా. ఇక ఎన్నికలకే వెళ్లాల్సి వస్తే, తమకంటూ ఓ పార్టీ ఉండాలన్న ఆలోచనతో, ఆల్ ఇండియా అమ్మా ద్రావిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే - అమ్మా డీఎంకే) పేరిట ఓ కొత్త పార్టీని ప్రారంభించేందుకు పన్నీర్ వర్గం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో 13 నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలు మినీ కురుక్షేత్రాన్ని తలపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.