: రిసార్ట్ అద్దె కట్టని శశికళ వర్గం.. రాబట్టుకోవడం ఎలాగో తెలియక తల పట్టుకున్న యాజమాన్యం
గోల్డెన్ బే రిసార్ట్.. తమిళ రాజకీయ సంక్షోభంతో ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. శశికళ తన వర్గం ఎమ్మెల్యేలను ఉంచిన ఈ రిసార్ట్ అద్దె ఇప్పటి వరకు పూర్తిగా చెల్లించలేదు. దీంతో అద్దె ఎవరు కడతారో, ఎలా వసూలు చేసుకోవాలో తెలియక రిసార్ట్ యాజమాన్యం తల పట్టుకుంది. పది రోజుల పాటు ఎమ్మెల్యేలు రిసార్ట్‌లో బస చేసినందుకు యాజమాన్యం రూ.60 లక్షల బిల్లు చేతిలో పెట్టింది. అయితే రూ.5 లక్షలు మాత్రమే బిల్లు చెల్లించారు. దీంతో మిగతా రూ.55 లక్షలు ఎలా రాబట్టుకోవాలన్న దానిపై రిసార్ట్ యజమాన్యం మల్లగుల్లాలు పడుతోంది. బిల్లు చెల్లించే వారి కోసం ఆరా తీస్తోంది.
పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో శశికళ తన వర్గం ఎమ్మెల్యేలు 128 మందిని మూడు బస్సుల్లో గోల్డెన్ బే రిసార్ట్‌కు తరలించారు. అలా ఈనెల 9 నుంచి 18వ తేదీ వరకు ఎమ్మెల్యేలు అందులోనే బస చేశారు. పళనిస్వామి బలపరీక్ష నేపథ్యంలో శశికళ వర్గం ఎమ్మెల్యేలు రిసార్ట్ వీడారు.