: రెట్టింపైన 4జీ సేవలు.. చైనాలో 7.70 కోట్ల మంది వినియోగదారులు
చైనాలో 4జీ వినియోగదారుల సంఖ్య నానాటికి పెరుగుతూ పోతోంది. 2015తో పోలిస్తే గతేడాది అది రెట్టింపు అయింది. 2016 చివరి నాటికి దేశంలో 4జీ వినియోగదారుల సంఖ్య 7.70 కోట్లకు చేరినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోని మొత్తం మొబైల్ వినియోగదారుల్లో 58 శాతం మంది 4జీ స్మార్ట్‌ఫోన్లకు అప్‌గ్రేడ్ అయ్యారు. ఈ మేరకు చైనా ప్రసార, సాంకేతికశాఖ ప్రతినిధి జెంగ్‌ఫెంగ్ తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 4జీ వినియోగదారులు చైనాలోనే అధికం. ప్రస్తుతం 5జీ టెక్నాలజీపై పరిశోధనలు ప్రారంభించిన చైనా 2020 నాటికి 5జీ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తోంది. మరోవైపు 2018 నాటికి 20 లక్షల 4జీ బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.