: కేంద్రం వెన్నుదన్ను, విపక్షాల అండ... అయినా సాధించలేకపోయిన పన్నీర్ సెల్వం!


ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అధికారం ఉంది, కేంద్రం వెన్నుదన్నుగా నిలిచింది. ఎలాగైనా శశికళ వర్గం, అధికారంలోకి రాకుండా చూడాలని డీఎంకే గట్టి పట్టుతో ఉంది. మెజారిటీ కూడా స్వల్పమే. ప్రజల మద్దతుంది. సామాజిక మీడియా అండగా నిలిచింది. అయినా, ఇవేమీ పన్నీర్ సెల్వంను కాపాడలేదు. కనీసం 20 మందిని ఆకర్షిస్తే, ప్రభుత్వం పడిపోతుంది. ఆ 20 మందిని కూడా ఆయన తన వర్గంలోకి చేర్చుకోలేకపోవడం, ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పన్నీర్ కు ఎమ్మెల్యేలు మద్దతు పలకకపోవడానికి కారణాలను రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

పన్నీర్‌ సెల్వం తిరుగుబాటు చేసిన మరుక్షణమే శశికళ అప్రమత్తమై జాగ్రత్తగా వ్యవహరించారు. పార్టీలో ఉన్న అత్యధిక ఎమ్మెల్యేలకు తానే టికెట్లు ఇప్పించి ఉండటం ఆమెకు ప్లస్ పాయింట్ అయింది. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జాగ్రత్తపడి, వారిని రిసార్టుకు తరలించడంతో పాటు, వారికి బౌన్సర్లను కాపలాగా ఉంచి, నిత్యమూ వారికి హితబోధ చేశారు. తన వెంట ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందన్న నమ్మకాన్ని కలిగించారు. తమపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకోనీయకుండా వారి సెల్ ఫోన్లు తీసేసుకున్నారు. రిసార్టుల్లోని టీవీల్లో జయ టీవీ మినహా మరో చానల్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేశారు.

ఇక ఇప్పుడున్న ప్రజా ప్రతినిధుల్లో అత్యధికులు మొదటిసారి గెలిచినవారే. ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కూడా కాలేదు. ఎన్నికలకు నాలుగేళ్ల సమయముందని, అధికారాన్ని ఎందుకు వదులుకోవాలని ఆమె అడగటం, ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా ఆపింది. దీనికితోడు పన్నీర్ మెతక వైఖరి కూడా ఆయన కొంపముంచింది. జయలలిత పట్ల అభిమానం తనను గెలిపిస్తుందని నింపాదిగా ఉండిపోయారు. ఇంట్లో మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు. జయ నీడలో నడవడం మినహా రాజకీయాల్లో ఎత్తులు వేయడం, ప్రత్యర్థులను చిత్తు చేయడం ఆయనకు తెలియని విషయాలని, అందువల్లే ఆయనకు ఓటమి తప్పలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News