: ఆవేశం తన్నుకొస్తున్నా... నిశ్చేష్టుడై చూసిన పన్నీరు సెల్వం!
శశికళ వర్గానికి ఎదురు తిరిగిన మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆగ్రహం ముంచుకొస్తున్నా ఏమీ చేయలేని స్థితిలో మౌనంగా చూస్తూ నిలుచుండిపోయిన ఘటన తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకుంది. దివంగత జయలలితకు పన్నీరు సెల్వం ఎంత నమ్మినబంటో అందరికీ తెలిసిందే. జయలలిత కూర్చున్న కుర్చీలో కూడా కూర్చునేందుకు ఆయన అంగీకరించలేదు. అలాంటి సందర్భంలో అసెంబ్లీలో తాను ఏ నిర్ణయం తీసుకున్నా తనకు అండగా నిలిచిన స్పీకర్ ధన్ పాల్ మీదకు డీఎంకే ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. అడుగడుగునా స్పీకర్ ధన్ పాల్ ను అడ్డుకున్నారు. ఒక దశలో పన్నీరు సెల్వంకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్పీకర్ పోడియంపై దాడికి దిగారు.
అలాగే స్పీకర్ ను చేయిపట్టుకుని లాగారు. షర్టు చిరిగిపోయింది. నిన్నటి వరకూ అసెంబ్లీలో తనకు అండగా నిలిచిన స్పీకర్ పై డీఎంకే సభ్యులు దౌర్జన్యానికి దిగుగుతున్న సమయంలో పన్నీరు సెల్వంకు ఆగ్రహం ముంచుకొచ్చింది. అయితే తనకు పూర్తి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను పన్నీరు సెల్వం నిస్సహాయంగా చూస్తుండిపోయారే తప్ప ఏమీ మాట్లాడలేదు. అయితే ఈ సందర్భంగా ఆయన ముఖంలో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అనంతరం స్పీకర్ పట్ల డీఎంకే ఎమ్మెల్యేల ప్రవర్తనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఓపీఎస్ ప్రకటించారు. అంతలోనే కొంతమంది డీఎంకే ఎమ్మెల్యేలు ఆయనను ఎద్దేవా చేయడంతో ఆయన మౌనం వహించారు.