: మెరీనా బీచ్ లో.. ఓవైపు పళనిస్వామి, మరోవైపు స్టాలిన్
చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ప్రతిపక్ష నేత స్టాలిన్ లు ఇద్దరూ బీచ్ కు చేరుకున్నారు. బీచ్ లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద స్టాలిన్ దీక్షకు కూర్చున్నారు. ఆయనతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా దీక్షలో బైఠాయించారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాల పట్ల నిరసనగా స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అసెంబ్లీ నుంచి మార్షల్స్ తమను బలవంతంగా వెలుపలికి తరలించిన తర్వాత... గవర్నర్ విద్యాసాగర్ రావును స్టాలిన్ కలిశారు. సభలో అత్యంత దారుణంగా విశ్వాస పరీక్షను నిర్వహించారని ఈ సందర్భంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో, ఈ విషయంపై తాను నివేదిక తెప్పించుకుంటానని గవర్నర్ చెప్పినట్టు సమాచారం.
మరోవైపు అసెంబ్లీలో బల నిరూపణ పరీక్షలో గెలిచిన పళనిస్వామి కూడా తన ఎమ్మెల్యలేలతో కలసి మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అమ్మకు నమస్కరించి, నివాళి అర్పించారు. రాష్ట్రంలోని అగ్రనేతలు ఒకే ప్రాంతంలో ఉండటంతో, అక్కడ ఉద్రిక్తభరిత వాతావరణం నెలకొంది.