: చిన్నమ్మ చేసిన శపథాల్లో ఒకటి తీరింది...!
అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించి, లొంగిపోవాలని ఆదేశించిన అనంతరం జయలలిత నెచ్చెలి శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు వెళ్లే ముందు పురచ్చితలైవి, దివంగత జయలలిత సమాధి సాక్షిగా మూడు శపథాలు చేసిందంటూ వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. అందులో ఒక శపథం పార్టీని చీల్చాలని చూసేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలనన్నది ఒకటి. అదే సమయంలో తన వర్గం ఎమ్మెల్యేలతో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిని కానీయనని పేర్కొంటూ ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో ఆదేశించి జైలుకెళ్లింది. ఆమె జైలు కెళ్లినా ఆమె ఆశయాలను మాత్రం ఆమె అనుచరులు పూర్తి చేశారు.
పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారు. శశికళ కోరుకున్నట్టే పళనిస్వామిని తమిళనాట ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఇందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు అమలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంతో ముందు చూపుతో డివిజన్ ప్రకారం ఓటింగ్ నిర్వహించి సీఎం పట్ల విశ్వాసాన్ని ప్రకటించారు. సమావేశానికి ముందే తమ పార్టీలోని ఎమ్మెల్యేలు చేజారకుండా ఒక్కో మంత్రికి నలుగురు ఎమ్మెల్యేల బాధ్యత అప్పగించారు. సావధానంగా సభను ఏర్పాటు చేశారు. నిబంధనలకు అనుగుణంగా ముఖ్యమంత్రిని ఎన్నుకుందామని చెప్పారు.
ఇక్కడ ప్రత్యర్థివర్గం, ప్రతిపక్షం నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని ముందే ఊహించారు. దీంతో ప్రత్యర్థులు రహస్య ఓటింగ్ కు డిమాండ్ చేయగా, వారి డిమాండ్ తోసిపుచ్చుతూ డివిజన్ ప్రకారం ఓటింగ్ నిర్వహించారు. దీనిని విపక్షాలు అంగీకరించకపోవడంతో ముందు నోటికి పని చెప్పారు. నేరుగా దాడులకు దిగకుండా మార్షల్స్ ను ప్రయోగించారు. నిబంధనలు చూపుతూ వారిని సస్పెండ్ చేసి, మార్షల్స్ తో బయటకు నెట్టివేయించారు.
అనంతరం ఇతరులు బలహీన పడడంతో వారంతట వారే ఒక్కొక్కరుగా సభను వీడేలా చేశారు. దీంతో పళనిస్వామి పట్ల విశ్వాస తీర్మానం నెగ్గడం సులువయ్యేలా చేశారు. అనంతరం చిన్నమ్మ ఆశయ సాధనకు ఉపక్రమించారు. పళనిస్వామి బలపరీక్షలో నెగ్గినట్టు ప్రకటించి, ముఖ్యమంత్రిగా ఆయనకు ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు డీఎంకే, పన్నీర్ వర్గాన్ని ఇరుకునపెట్టడమే చిన్నమ్మ వర్గం లక్ష్యం కానుంది. దీనిని చిన్నమ్మ వర్గం ఎంత సమర్థవంతంగా నెట్టుకొస్తుందో చూడాలి.