: పాక్, భారత్ సరిహద్దుల్లో అడ్డు గోడ లేనట్లే!
పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను అరికట్టడానికి సరిహద్దుల్లో భారత్ గోడను నిర్మించాలని ఎప్పటినుంచో భావిస్తోన్న విషయం తెలిసిందే. కొన్నినెలల క్రితం భారత్ పీవోకేలో జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా గోడ నిర్మిస్తామని తెలిపారు. అయితే, ఆ ఆలోచనను భారత్ విరమించుకున్నట్లు సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. గోడకి బదులుగా ఆ ప్రాంతంలో స్మార్ట్ ఫెన్సింగ్ నిర్మించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. దీనికి అత్యాధునిక టెక్నాలజీతో సెన్సార్లను అమర్చనున్నట్లు చెప్పారు.
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో గోడ నిర్మించాలన్న ఆలోచన మొదటిసారిగా 2013లో హీరానగర్, సాంబా సెక్టార్లలో జంట దాడుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. సరిహద్దు వెంబడి 179 కిలోమీటర్ల మేర గోడను నిర్మించాలని భావించారు. అయితే, గోడ నిర్మాణానికి పలు సమస్యలు వస్తున్నాయని అధికారులు అంటున్నారు. వాటిలో ఇంటెలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన ప్రాంతాలు ఎక్కువగా ఉండటం ఒక కారణమని చెప్పారు. మరో సమస్య ఏమిటంటే, అక్కడి ప్రజలు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయడానికి ఇష్టపడకపోవడమేనని అన్నారు. ఒకవేళ అక్కడ గోడను నిర్మిస్తే అక్కడ కేవలం 25 శాతం భూమి మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పారు.
2015లోనూ భారత్.. సరిహద్దులో గోడ నిర్మించాలనుకున్న నేపథ్యంలో పాక్ యూఎన్ కౌన్సిల్‌ను ఆశ్రయించింది. మరోపక్క మిలటరీ ఆపరేషన్స్‌కు ఇబ్బంది కలగొచ్చన్న ఉద్దేశంతో భారత ఆర్మీ సైతం ఈ గోడపై అభ్యంతరం తెలిపింది.