: చిరిగిన చొక్కాతో బయటకు వచ్చి... అసెంబ్లీ స్పీకర్‌పై సంచలన ఆరోపణలు చేసిన స్టాలిన్
తమిళనాడు శాసనసభలో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో గందరగోళం సృష్టించిన డీఎంకే నేతలను స్పీకర్ ధన్పాల్ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము అసెంబ్లీ బయటకు వెళ్లబోమని చెప్పి అక్కడే ఉండిపోయిన డీఎంకే నేతలు ఎట్టకేలకు బయటకు వచ్చారు. ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ స్పీకర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. స్పీకర్ తన చొక్కా తానే చింపుకొని డీఎంకే నేతలు చింపారని అవాస్తవాలు చెబుతున్నారని ఆయన అన్నారు. తాము సభలో కేవలం రహస్య ఓటింగ్‌కు మాత్రమే పట్టుబట్టామని అన్నారు.
తమను మార్షల్స్ బలవంతంగా బయటకు పంపేశారని అన్నారు. అసెంబ్లీలోకి తాము వెళ్లబోమని చెప్పారు. స్పీకర్ ఆదేశాలతో సభలోకి పోలీసులు సైతం వచ్చి తమను బయటకు లాక్కొచ్చారని, తన చొక్కా చిరిగిపోయిందని ఆయన తన చినిగిన చొక్కాని చూపిస్తూ ఆరోపణలు గుప్పించారు. తన చిరిగిన చొక్కాను మార్చుకోకుండానే మీడియా ముందుకు తమ ఎమ్మెల్యేలతో వచ్చిన స్టాలిన్ అక్కడే కాసేపు ఉన్నారు. స్పీకర్ సభా మర్యాదలను పాటించలేదని అన్నారు. తాము గవర్నర్ ని కలవనున్నట్లు తెలిపారు.