: ప్రార్థనా మందిరంపై దాడికి ప్రతీకారం తీర్చుకున్న పాక్.. వందమంది ఉగ్రవాదుల హతం
‘తనదాకా వస్తేకానీ.. ’ అన్న సామెతను పాక్ నిజం చేస్తోంది. సింధ్ ప్రావిన్స్‌లోని లాల్ ఖలందర్ సూఫీ ప్రార్థనా మందిరంలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడికి పాక్ ప్రతీకారం తీర్చుకుంది. దాడి జరిగిన వెంటనే స్పందించిన పాక్ శుక్రవారం నాటికి వందమంది ఉగ్రవాదులను హతమార్చింది. గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 88 మంది మృతి చెందగా 250 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉగ్రవాదుల ఏరివేతకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాక్ భద్రతా దళాలు దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం వందమంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఏయే ప్రాంతాల్లో ఎంతమందిని హతమార్చిందీ వెల్లడించలేదు.
మందిరంపై దాడి వెనక ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు గుర్తించిన పాక్ ఆర్మీ 76 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పేర్లున్న జాబితాను ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయానికి అందించి వెంటనే చర్యలు తీసుకోవడమో, లేదంటే తమకు అప్పగించడమో చేయాలని డిమాండ్ చేసింది. కాగా దాడి తమపనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. మరోపక్క, ప్రార్థనా మందిరానికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సెహ్వాన్ పట్టణంలో పోలీసుల వాహనాలకు నిప్పంటించి రాస్తారోకో చేశారు.