: వలసల నిషేధంపై మరో ఆదేశానికి సిద్ధమవుతున్న ట్రంప్.. వచ్చే వారమే ఉత్తర్వులు!
ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించి విమర్శలు కొని తెచ్చుకున్న ట్రంప్ మరోమారు అటువంటి ఉత్తర్వుల జారీకి సిద్ధమవుతున్నారు. పాత ఉత్తర్వుల్లో స్వల్ప మార్పులు చేసి కొత్తగా ఆదేశాలు జారీ చేయనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. మరో వారంలోనే కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేయనున్నట్టు శుక్రవారం ఆయన మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ అమెరికాలో అడుగుపెట్టే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేయబోతున్నట్టు తెలిపారు.
కోర్టు నిర్ణయంపై స్పందిస్తూ.. అది చాలా తప్పుడు నిర్ణయమని, దేశ భద్రత, రక్షణకు ప్రమాదకరమైనదని పేర్కొన్నారు. కొత్త ఆదేశాలు పక్కాగా ఉంటాయని స్పష్టం చేశారు. కాగా ట్రంప్ ట్రావెల్ బ్యాన్ నిర్ణయాన్ని టెక్సాస్ రాష్ట్రం సమర్థించింది. మరోవైపు ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులపై తొమ్మిదో సర్క్యూట్ అప్పీల్ కోర్టు ఇచ్చిన తీర్పును అమెరికా న్యాయశాఖ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆ ఉత్తర్వులు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసింది.