: మూడు దశాబ్దాల తర్వాత బలపరీక్షకు వేదికవుతున్న తమిళ అసెంబ్లీ!
తెలుగు టీవీ సీరియళ్లను తలపించిన తమిళ రాజకీయ సంక్షోభానికి పళనిస్వామి ప్రమాణ స్వీకారంతో తెరపడింది. అయితే బలపరీక్ష పేరుతో టెన్షన్ ఇంకా మిగిలే ఉంది. అసెంబ్లీలో నేడు(శనివారం) పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకోనున్నారు. మూడు దశాబ్దాల తర్వాత తమిళనాడు అసెంబ్లీలో జరుగుతున్న తొలి బలపరీక్ష ఇదే కావడం గమనార్హం.
తొలిసారి 1952లో అప్పటి ముఖ్యమంత్రి రాజాజీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని అరుప్పుకొట్టెలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పరాజయం పాలయ్యారు. దీంతో ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అదే ఏడాది జూలై 3న ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 375 మంది సభ్యులున్న శాసనసభలో 200 మంది రాజాజీకి ఓటేశారు. దీంతో ఆయన నెగ్గారు. ఇది దేశంలోనే జరిగిన తొలి అవిశ్వాస తీర్మానం.
1972లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధిపై శాసనసభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎంజీఆర్‌ను డీఎంకే కోశాధికారి పదవి నుంచి సీఎం కరుణానిధి తొలగించారు. దీంతో పలువురు శాసనసభ్యులు ఎంజీఆర్‌కు మద్దతు పలికారు. ఫలితంగా డిసెంబరు 11న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 172 మంది ఎమ్మెల్యేలు కరుణకు జై కొట్టడంతో ఆయన నెగ్గారు.
చివరిగా 1988లో ఎంజీఆర్ మరణించాక అన్నాడీఎంకే పార్టీ జయ, జానకి వర్గాలుగా చీలిపోయింది. అన్నాడీఎంకేకి 198 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, డీఎంకేకు 33 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. దీంతో తమిళనాడు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ సతీమణి ప్రమాణ స్వీకారం చేశారు. బలపరీక్షలో జానకికి 97 మంది, జయలలితకు 33 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. అయితే సభలో చోటుచేసుకున్న పరిణామాల కారణంగా కేంద్రం అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు తమిళనాడు శాసనసభ బలపరీక్షకు వేదిక అవుతోంది.