: ‘జబర్దస్త్’ షోపై ఉమ్మడి హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఇటువంటి షోలతో న్యాయ వ్యవస్థ హుందాతనానికి భంగం కలుగుతుందని వ్యాఖ్య!
ఈటీవీలో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్’ షోలో న్యాయ వ్యవస్థను కించపరిచేలా స్కిట్‌ను ప్రదర్శించారంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇటువంటి షోలపై నిషేధం కానీ, నియంత్రణ కానీ అవసరమని, అందుకు మార్గదర్శకాలు రూపొందించాలని అభిప్రాయపడింది. లేదంటే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే కార్యక్రమాలను అడ్డుకోవడం సాధ్యం కాదని పేర్కొంది. ఇటువంటి కార్యక్రమాల్లో చూపించే న్యాయమూర్తులు, న్యాయవాదుల పాత్రలు, వారు పలికే డైలాగులను చూసే నిరక్ష్యరాస్యులు, గ్రామీణులు.. న్యాయస్థానాల్లోనూ ఇలాగే జరుగుతుందని నమ్మే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది. తద్వారా న్యాయ వ్యవస్థపై వారిలో తప్పుడు అభిప్రాయం కలుగుతుందని, న్యాయమూర్తులు, న్యాయవాదుల ప్రతిష్ఠకు, హుందాతనానికి భంగం వాటిల్లుతుందని ఉమ్మడి హైకోర్టు అభిప్రాయపడింది.
జూలై 10, 2014న జబర్దస్త్ షోలో న్యాయ వ్యవస్థను కించపరిచేలా స్కిట్‌ను ప్రదర్శించారంటూ న్యాయవాది వై.అరుణ్‌కుమార్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నాగేంద్రబాబు, రోజా, యాంకర్లు అనసూయ, రష్మీ, ఇతరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ కేసును కొట్టివేయాలంటూ నాగేంద్రబాబు, రోజా తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన కోర్టు కేసును కొట్టివేస్తున్నట్టు పేర్కొంది.