: ఆసుపత్రిలో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యే మద్దతు ఎవరికో?
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి రేపు బలపరీక్ష ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే ఎంతో కీలక పాత్ర పోషిస్తాడు. ఇటువంటి తరుణంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే నార్ధామలై ఆర్ముగం మద్దతు పళనిస్వామికా? లేక పన్నీరుకా? అనేది చర్చనీయాంశమైంది. అయితే, హెర్నియా శస్త్ర చికిత్స చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆర్ముగం తన మద్దతును ఎవరికి ప్రకటిస్తారనే దానిపై తన నియోజకవర్గ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కొద్ది రోజుల క్రితం చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఆయన హెర్నియా శస్త్ర చికిత్స చేయించుకున్నారు. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. కాగా, శశికళ తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్ట్స్ లో దాచి పెట్టిన సమయంలో, ఆర్ముగం కూడా వారిలో ఉన్నారని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలు అనుకోవడం గమనార్హం.