: కొత్త షర్టు రంగు పోయిందని దుకాణం యజమానికి చుక్కలు చూపించాడు!
ఒక షర్టు కొంటే మరోటి ఉచితం కింద కొనుగోలు చేసిన చొక్కా రంగు పోయిందని ఓ విద్యార్థి విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. ఆ షర్టును విక్రయించిన దుకాణం యజమానికి చుక్కలు చూపించాడు. కేరళలోని కొట్టాయంలో ఉన్న కల్యాణ్ సిల్క్స్ అనే షాపుకు మార్ బెసెల్లియన్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి వెళ్లాడు. ఈ ఆఫర్ కింద కొనుగోలు చేసిన షర్ట్స్ లో ఒక దానిని తొడుక్కున్నాడు. ఆ మర్నాడు దానిని ఉతకడంతో రంగు పోయింది. ‘పోతే పోనీలే’ అని అనుకున్న ఆ విద్యార్థి ఆ షర్టును తొడుక్కుంటే మరో సమస్య వచ్చిపడింది. ఆ రంగు అంతా తనకు అంటడం గమనించాడు.
వెంటనే, ఆ షర్ట్ పట్టుకెళ్లి సదరు దుకాణానికి వెళ్లాడు. ఈ విషయమై అతనికి సేల్స్ మెన్ తో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, ఆ దుకాణంలో నుంచి బయటకు వచ్చిన సదరు విద్యార్థి తన ప్రతాపం చూపాడు.ఈ సమాచారం తన బంధువులకు, స్నేహితులకు, కాలేజీ విద్యార్థులకు చెప్పడంతో వారు అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, దిగొచ్చిన దుకాణం నిర్వాహకులు, ఆ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని, లక్ష రూపాయలు నష్ట పరిహారంగా ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, సేల్స్ మెన్ తనపై చేయి చేసుకున్నాడని అందుకే ఇంత రాద్దాంతం చేయాల్సి వచ్చిందని సదరు విద్యార్థి చెప్పాడు.