: మా 89 మంది ఎమ్మెల్యేలు రేపు పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు: కీలక నిర్ణయాలు తీసుకున్న స్టాలిన్
తమిళనాడు సీఎంగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి రేపు అసెంబ్లీలో బల నిరూపణ పరీక్ష ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రేపు ఎదురుకాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ తమ వ్యూహాలపై చర్చోపచర్చలు జరుపుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఈ రోజు సాయంత్రం తమ పార్టీ నేతలతో భేటీ అయి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటివరకు ఓటింగ్లో పాల్గొనమని చెప్పిన డీఎంకే తాజాగా వ్యూహాన్ని మార్చింది. రేపు అసెంబ్లీలో జరిగే బలపరీక్షకు హాజరుకావాలని నిర్ణయించుకుంది.
పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డీఎంకే ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే మొదటి నుంచి ప్రజా వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తోందని, అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్టాలిన్ చెప్పారు. రాజకీయ సంక్షోభం వల్ల తమిళనాడులో పాలన సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. 89 మంది తమ ఎమ్మెల్యేలు రేపు పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పారు.