: అభిమాని ఆటోలో మెగాస్టార్ చిరంజీవి!
స్టార్ మా టీవీలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నాలుగో సీజన్ నిన్న ప్రారంభమైంది. ఈ సీజన్ కు మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ కు ఎంపికైన వ్యక్తి పేరు సతీష్. చిరంజీవికి వీరాభిమాని అయిన సతీష్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. హైదరాబాద్ మేడ్చల్ లో నివసించే అతను ఈ కార్యక్రమానికి ఎంపిక కావడంపై తన సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, తన కోరికను కూడా వెల్లడించాడట. మెగాస్టార్ చిరంజీవి తన ఆటోలో ఎక్కితే తాను చాలా సంతోషిస్తానని ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ బృందంతో చెప్పాడట.
ఇందుకు,‘ఓకే’ చెప్పిన మెగాస్టార్ అతని ఆటోలో ఎక్కి అన్నపూర్ణ స్టూడియోస్ వరకు ప్రయాణించారు. దీంతో, ఆ అభిమాని సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో తాను పాల్గొన్నది మెగాస్టార్ చిరంజీవి కోసమేనని, ఆయన తన ఆటో ఎక్కితే చాలని అనుకున్నానని అన్నాడు. తన తండ్రి చనిపోవడంతో చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నానని చెప్పాడు. తన సోదరి పెళ్లి నిమిత్తం అయిన ఖర్చులను తీర్చాల్సి ఉందని అన్నాడు. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాను రూ.1.6 లక్షలు గెలుచుకున్నానని, చిరంజీవి వ్యక్తిగతంగా తనకు రూ.2 లక్షలు అందజేశారని చెప్పాడు. ఆ డబ్బులతో తన అప్పులు తీర్చుకుంటానని సతీష్ సంతోషం వ్యక్తం చేశాడు.