: కంగ్రాట్స్.. పీవీ సింధు.. ఒక తరాన్ని ప్రోత్సహించావు: నీతా అంబానీ
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యుఎఫ్) ర్యాంకింగ్స్ లో 5వ ర్యాంకు సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్, ‘రియో’లో సిల్వర్ పతకం సాధించిన పీవీ సింధుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు నీతా ముఖేశ్ అంబానీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘బీడబ్ల్యుఎఫ్ ర్యాంకింగ్స్ లో 5వ స్థానంలో నిలిచిన పీవీ సింధుకు శుభాకాంక్షలు. బ్యాడ్మింటన్ క్రీడపై మక్కువ కలిగేలా ఒక తరం అమ్మాయిలను ప్రోత్సహించావు ! వెల్ డన్.. చాలా గర్వపడుతున్నాను’ అని తన ట్వీట్ లో నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, కేంద్ర మంత్రి విజయ్ గోయెల్, ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా తదితరులు పివి సింధును ఈ సందర్భంగా అభినందిస్తూ ట్వీట్లు చేశారు. ‘పీవీ సింధు.. కంగ్రాట్స్, త్వరలోనే నెంబర్ వన్ స్థానాన్ని సాధించాలని ఆశిస్తున్నాను’ అని మంత్రి విజయ్ గోయెల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, తనకు అభినందనలు తెలిపిన వారందరికీ సింధు ధన్యవాదాలు తెలిపింది.