: రిలయన్స్ జియో యూజర్లకు చేదు వార్త చెప్పిన ట్రాయ్!
ఉచిత మంత్రంతో మార్కెట్లోకి వచ్చి ఎవరూ ఊహించని విధంగా వినియోగదారులను సంపాదించుకున్న రిలయన్స్ జియో సగటు 4జీ ఇంటర్నెట్ వేగం సగానికి పడిపోయిందని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) తెలిపింది. మరోవైపు 4జీ నెట్‌వర్క్‌లో అత్యధిక డేటా బదిలీ చేస్తున్న సంస్థగా ఎయిర్‌టెల్ తొలిస్థానంలో నిలిచిందని పేర్కొంది. ఈ అంశంలో ఎయిర్‌టెల్ తరువాతి స్థానాల్లో ఐడియా, వొడాఫోన్ సంస్థలు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో డేటా వేగాల్లో జియో వీటన్నింటి కన్నా ముందు నిలిచిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది జనవరి నెలకు గాను 11.62 ఎంబీపీఎస్ డేటా వేగంతో ఎయిర్‌టెల్ తొలిస్థానంలో నిలిచిందని ట్రాయ్ తెలిపింది. కాగా, జియో డేటా వేగం కేవలం 8.345 ఎంబీపీఎస్‌గా ఉందని పేర్కొంది. డిసెంబరు వరకు జియో వేగం 18.146 ఎంబీపీఎస్‌గా ఉండేది. ప్రస్తుతం ఈ విషయంలో ఎయిర్‌టెల్ తరువాతి స్థానాల్లో ఉన్న ఐడియా, వొడాఫోన్‌లు 10.562 ఎంబీపీఎస్, 10.301 ఎంబీఎపీఎస్ సగటు డేటా వేగాలను నమోదు చేశాయని ట్రాయ్ వెల్లడించింది.