: 20 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్లి నామినేషన్ వేసిన ఐరన్ లేడీ ఇరోమ్ షర్మిల
సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టంకు వ్యతిరేకంగా 16 ఏళ్లు నిరాహార దీక్ష చేసి ఇటీవలే విరమించిన మణిపూర్ ఐరన్ లేడీ ఇరోమ్ షర్మిల కొన్ని రోజుల్లో జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపిన విషయం తెలిసిందే. తన పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలియన్స్ పార్టీ తరపున పోటీలోకి దిగిన ఆమె.. ఈ రోజు మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి సుమారు 20 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్లి ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. తోబుల్ నియోజకవర్గం నుంచి మణిపూర్ సీఎం ఓక్రమ్ ఇబోబి సింగ్‌పై ఆమె ఈ ఎన్నికల్లో పోటీకి దిగారు. వచ్చేనెల నాలుగు, ఎనిమిది తేదీల్లో మణిపూర్‌లో ఎన్నికలు జరుగుతాయి.