: పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలు పట్టుకొని మరోసారి రెచ్చిపోయిన కశ్మీర్ యువత
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ రోజు అక్కడి జామియా మసీద్‌లో ప్రార్థనలు నిర్వహించిన అక్కడి యువకులు రెచ్చిపోయారు. పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలను పట్టుకొని భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతూ అలజడి రేపారు. ముఖానికి ముసుగులు ధరించి, చేతికి దొరికిన వస్తువులను భద్రతా దళాలపైకి విసిరారు. దీంతో వెంటనే అప్రమత్తమయిన భద్రతా దళాలు వారిని అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల భారత ఆర్మీ చీఫ్ రావత్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేసిన పలు వ్యాఖ్యలే వారు ఆందోళనకు దిగడానికి కారణమని సమాచారం. అక్కడ మరోసారి అల్లర్లు చెలరేగకుండా భద్రతాదళాలు చర్యలు తీసుకుంటున్నాయి. దీనిపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.