: మరో హై డ్రామా.. సీఎం పళనిస్వామితో పాటు మంత్రులందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మధుసూదనన్
తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో శశికళ వర్గానికి పన్నీర్ సెల్వం వర్గం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పన్నీర్ సెల్వం వర్గంలో ఉన్న అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదనన్.. ప్రస్తుతం జైల్లో ఉన్న శశికళతో పాటు దినకరన్, వెంకటేశ్‌లను అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సీఎం పళనిస్వామితో పాటు మంత్రివర్గ సహచరులను సైతం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. అసలైన అన్నాడీఎంకే పార్టీ తమదేనని ఈ సందర్భంగా మధుసూదనన్ ఉద్ఘాటించారు. అమ్మ జయలలిత అనుసరించిన పార్టీ నియమాలు, ఆదర్శాలను పళనిస్వామితో ఉన్న నేతలు ఉల్లఘించారని ఆయన వివరణ ఇచ్చారు. జయలలితకు ఇచ్చిన మాటను వారు తప్పారని వ్యాఖ్యానించారు.