: వారు అంతలా భయపడ్డారంటే, నేను బాగా నటించాననేగా అర్థం?: ప్రేమ్ చోప్రా
బాలీవుడ్ సీనియర్ నటుడు, విలన్ పాత్రలకు ఫేమస్ అయిన ప్రేమ్ చోప్రా నటనా ప్రస్థానం మొదలై యాభై ఏళ్లు. తన కెరీర్ లో మొత్తం 350 సినిమాల్లో ఆయన నటించాడు. అయితే, ఆ సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలనే ఆయన పోషించాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నాటి విషయాలను ఆయన గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో తన విలనిజం ఎంతలా పండిందంటే..నిజ జీవితంలో మగవాళ్లకు తాను ఎదురుపడితే, వారి భార్యలను దాచేసేవారని, వారు, అంతలా, భయపడ్డారంటే, తాను బాగా నటించాననే కదా అర్థం అని ఆయన అన్నారు.
సినిమాల్లో చేసిన విలన్ పాత్రల్లో ఉన్నట్టుగానే తాను నిజ జీవితంలో కూడా ఉంటానని ప్రేక్షకులు భావిస్తుంటారని, ఆ విధంగా వారు భావించడాన్ని తాను కాంప్లిమెంట్ గానే తీసుకుంటానని అన్నారు. అసలు, సినీ పరిశ్రమలోకి హీరో కావాలని తాను అడుగుపెట్టానని, అయితే, తాను ప్రధాన పాత్రలో నటించిన ఓ బాలీవుడ్ సినిమా సక్సెస్ కాకపోవడంతో తనకు హీరోగా నటించే అవకాశాలు రాలేదని అన్నారు. దీంతో, విలన్ పాత్రల్లో నటించమన్నారని, ఆ పాత్రల్లో నటించడంతో తన జీవితం మలుపు తిరిగిందని ప్రేమ్ చోప్రా చెప్పుకొచ్చారు.