: పళనిస్వామి వర్గానికి వ్యతిరేకంగా వేగంగా పావులు కదుపుతున్న పన్నీర్ సెల్వం వర్గం
రోజుకో మలుపు తిరుగుతూ వచ్చిన తమిళనాడు రాజకీయ పరిస్థితులు అదే ఉత్కంఠను కొనసాగిస్తున్నాయి. పళనిస్వామిని ముఖ్యమంత్రిగా నియమించిన ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావు 15 రోజుల్లోగా అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాలని సూచించిన విషయం తెలిసిందే. తమ వద్ద నుంచి ఎమ్మెల్యేలు జారి పోయేందుకు అవకాశం ఇవ్వకుండా రేపే బలపరీక్షకు సిద్ధమని ప్రకటించిన పళనిస్వామి తన వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు వెళుతుండగా.. మరో వైపు ఆయన ప్రత్యర్థి మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు కూడా అదే స్థాయిలో తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ ధన్‌పాల్‌తో వారు భేటీ అయ్యారు. రేపు రహస్య ఓటింగ్ ద్వారానే బలపరీక్ష నిర్వహించాలని వారు కోరారు. పన్నీరు వర్గంలో ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
పళనిస్వామి పట్ల వ్యతిరేకత తెలుపుతున్న పలువురు రిసార్టులోని ఎమ్మెల్యేలు రేపు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పళనిస్వామి గోల్డెన్ బే రిస్టార్‌కు వెళ్లి వారిని భుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కూడా తమ పార్టీ నేతలతో భేటీ ఏర్పాటు చేసి రేపటి కార్యక్రమంపై సూచనలు చేయనున్నారు.