: పళనిస్వామికి ఎదురుగాలి... ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టిస్తోన్న రిసార్టులోని ఎమ్మెల్యేలు!

తమకు అన్నాడీఎంకేలో పూర్తి మద్దతు ఉందని తెలపడంతో తమిళనాడు ఇన్‌ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావు.. పళనిస్వామికి అవకాశం ఇవ్వడం, పళనిస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయిన విషయం తెలిసిందే. శశికళ నటరాజన్ వర్గంలో అంతా బాగుందని అనుకుంటే ఇప్పుడు పళనిస్వామికి కొత్త తలనొప్పి వచ్చింది. రిసార్టులో ఉన్న శశికళ వర్గ ఎమ్మెల్యేలలో అధికమంది పళనిస్వామికి మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపించకపోవడమే ఇందుకు కారణం. మైలాపూర్ ఎమ్మెల్యే, మాజీ డీజీపీ అయిన నటరాజ్ ఈ రోజు ఉదయం పళనిస్వామికి షాక్ ఇచ్చారట. తాను అమ్మ ఫొటో పెట్టుకుని ఎన్నికల్లో గెలిచానని, అందువల్ల అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనని ఆయన పళనిస్వామితో చెప్పారట. కావాలంటే అమ్మ ఫొటోతో మరోసారి ఎన్నికలకు వెళ్తానని కూడా ఆయన అనడంతో పళనిస్వామికి టెన్షన్ పట్టుకుందట.
సెంగొట్టియాన్ లాంటి వాళ్లకు పళనిస్వామి మంత్రిపదవి ఇచ్చిన నేపథ్యంలో అమ్మ జయలలిత భక్తులైన కొంతమందిలో తీవ్ర అసంతృప్తి చేరిందట. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గంలో ఉన్న సెంగొట్టియాన్‌కు, రెండోసారి వరుసగా ఎన్నికైన జయలలిత తన కేబినెట్‌లో అవకాశం కల్పించలేదన్న విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తికి ఇప్పుడు పళనిస్వామి అధిక ప్రాధన్యాత ఇవ్వడం పట్ల అమ్మ విధేయులు గరం గరంగా ఉన్నారట. కేవలం నటరాజ్ మాత్రమే కాక సుమారు మరో 18 మంది వరకు ఎమ్మెల్యేలు కూడా రిసార్టులో ఎదురు తిరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు జరిగే అసెంబ్లీ బల పరీక్షలో పళనిస్వామికి ముచ్చెమటలు పట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల అంచనా.