: విసిగిపోయి...ఐసీసీకి సవాల్ విసిరిన రవిశాస్త్రి!
ఐసీసీ చీఫ్ గా శశాంక్ మనోహర్ అధికారం చేపట్టిన నాటి నుంచి బీసీసీఐకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. బీసీసీఐని వీలైనంత నష్టాల్లోకి లేదా కష్టాల్లోకి నెట్టడమే లక్ష్యంగా ఆయన ఎత్తుగడలు వేస్తున్నారు. తొలుత గతంలో ఎన్నడూ లేని విధంగా చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు ఇంగ్లండ్ కు భారీ మొత్తంలో నిధులు కేటాయించడం, ఆసీస్ కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, డీఆర్ఎస్ విధానంపై భారత్ విజ్ఞప్తిని పట్టించుకోకపోవడం.. ఇలా ప్రతివిషయంలోనూ శశాంక్ మనోహర్ బీసీసీఐకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా బీసీసీఐ డిమాండ్ చేస్తున్న మెజారిటీ వాటాను కూడా ఐసీసీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
దీంతో బీసీసీఐలో ఉన్నవారితో పాటు వెటరన్ లకు కూడా ఆగ్రహం కలుగుతోంది. అయితే ఐసీసీతో ఉన్న కామెంటరీ కాంట్రాక్టుల కారణంగా ఎవరూ విమర్శించేందుకు ముందుకు రాలేదు. దీంతో సహనం నశించిన రవిశాస్త్రి ఐసీసీపై ధ్వజమెత్తాడు. బీసీసీఐలో ఏర్పడిన సంక్షోభాన్ని ఆసరా చేసుకుని లబ్దిపొందుదామని చూస్తే తప్పులో కాలేసినట్టేనని హెచ్చరించాడు. బీసీసీఐలో నెలకొన్న సంక్షోభం తాత్కాలికమేనని స్పష్టం చేశాడు. కొత్తగా బీసీసీఐలో ఎవరు బాధ్యతలు చేపట్టినా వారి లక్ష్యం బీసీసీఐకి పూర్వవైభవం తేవడమే అవుతుందని సూచించాడు.
ఐసీసీకి సమకూరుతున్న ఆదాయంలో 80 శాతం బీసీసీఐ నుంచేనన్న విషయం గుర్తుంచుకోవాలని పరోక్షంగా శశాంక్ మనోహర్ ను హెచ్చరించాడు. బీసీసీఐ ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని మినహాయించి, ఐసీసీ వాస్తవ ఆదాయం ఎంతో ప్రకటించాలని సవాల్ విసిరాడు. ప్రస్తుత పరిస్థితిని ఆసరా చేసుకుని శ్రీలంక మినహా, బంగ్లాదేశ్, జింబాబ్వే వంటి జట్లు కూడా బీసీసీఐకి వ్యతిరేకంగా వ్యవహరించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఆయన తెలిపాడు. భారత్ ఐసీసీ నుంచి తప్పుకుంటే ఏం జరుగుతుందో ఓసారి ఆలోచించుకోవాలని రవిశాస్త్రి ఆగ్రహంగా హెచ్చరించాడు. కాగా, అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు నోరుమూసుకున్న ఐసీసీ...సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన తప్పుకోగానే బీసీసీఐతో ఆటలాడడం ప్రారంభించింది.