: నా భర్తతో కలసి ప్రచారం చేసే ఆలోచన లేదు: డింపుల్ యాదవ్
తన భర్త అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఆలోచన తనకు లేదని డింపుల్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ కు బీజేపీ చేసిందేమీ లేదని ఆమె మండిపడ్డారు. అఖిలేష్ చాలా దూరదృష్టి ఉన్న నాయకుడని ఆమె కితాబిచ్చారు. ఓ ఇంటర్వ్యూలో తన భర్తతో కలసి మాట్లాడుతూ ఆమె పైవ్యాఖ్యలు చేశారు. అఖిలేష్, రాహుల్ కలసికట్టుగా ఎన్నికల ప్రచారపర్వంలో పాల్గొంటుండగా, డింపుల్ మాత్రం విడిగా ప్రచారం చేస్తున్నారు.
ఇదే ఇంటర్వ్యూలో అఖిలేష్ మాట్లాడుతూ, యూపీ ఎన్నికల్లో విజయం ఎస్పీ, కాంగ్రెస్ కూటమిదే అని అన్నారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టానని గుర్తు చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా ఎంత నల్లధనాన్ని వెలికి తీశారో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమిని చూసి బీజేపీ ఆందోళన చెందుతోందని అన్నారు.