: సినీ దర్శకుడినంటూ చీట్ చేసిన వ్యక్తిపై రేప్ కేసు
హైదరాబాదులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సినీ దర్శకుడినంటూ యువతిని మోసగించిన వ్యక్తిపై రేప్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... బోడుప్పల్ ప్రాంతంలో నివసిస్తున్న యువతికి సినిమాలంటే ఇష్టం. దీంతో సినిమాల్లో నటించాలని ఆశించింది. ఈ క్రమంలో ఆమెకు మధురానగర్ లో నివసిస్తున్న కార్తికేయతో ఫేస్ బుక్ లో పరిచయమైంది. ఫేస్ బుక్ ప్రొఫైల్ లో సినీ దర్శకుడినని ఉండడంతో అతని పరిచయాన్ని అంగీకరించిన ఆమె, కాలక్రమంలో అతని ఆలోచనలు నచ్చడంతో సినిమాకు పెట్టుబడి పెడతానంటూ ముందుకు వచ్చింది.
దీంతో ఎవరినో ఎందుకు నీకే స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తానన్న వంకతో ఆమెకు కొన్ని ఫోటోలు తీశాడు. ఈ క్రమంలో ఆమెను లోబరుచుకున్నాడు. అనంతరం ఆ ఫోటోలు,వీడియోలు అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ వేధింపులు రోజురోజుకీ పెరిగిపోతుండడంతో విసిగి వేసారిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.