: భారత స్వాతంత్ర్యోద్యమాన్ని మలుపుతిప్పిన ఆ తుపాకీ దొరికింది!
కొన్ని సంఘటనలు కాకతాళీయంగా జరుగుతుంటాయి. అలా జరిగిన ఓ ఘటన బీఎస్ఎఫ్ జవానులను అమితానందాశ్చర్యాల్లో ముంచెత్తింది. భారత స్వాతంత్ర్యానికి సంబంధించిన ఏ ఘటనైనా భారతీయుల్లో ఆసక్తి రేపేదేననడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా యువతలో భగత్ సింగ్ కు సంబంధించి ఏ అంశమైనా ముఖ్యమైనదే. భగత్ సింగ్ ఉరితీత భారత స్వాతంత్ర్యోద్యమంలో కీలక పరిణామాలకు, ఆందోళనలకు కారణమైంది. భగత్ సింగ్ నూనూగు మీసాల వయసులోనే బ్రిటిషర్లకు ఎదురు తిరిగాడు. 1928 డిసెంబర్ 17న బ్రిటీష్ అధికారి జాన్ శాండర్స్ ను సీరియల్ నెంబర్ 168896 కలిగిన 32ఎంఎం కోల్ట్ ఆటోమేటిక్ పిస్టల్ తో అత్యంత సమీపం నుంచి కాల్చి చంపేశాడు.
ఆ తరువాత భగత్ సింగ్ ను పట్టుకుని 23 మార్చి 1931లో ఉరితీశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆ తుపాకీని స్వాధీనం చేసకున్నారు. ఆ తరువాత ఆ తుపాకీ సంగతి అంతా మర్చిపోయారు. దీనిని తొలిసారి బీఎస్‌ఎఫ్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్, టాక్టిక్స్ (సీడబ్ల్యూఎస్టీ) మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అయితే, ఆ తుపాకీ భగత్ సింగ్ దేనన్న విషయం అక్కడున్న వారికి ఎవరికీ తెలియదు. మ్యూజియంలోని వస్తువులను శుభ్రం చేసే క్రమంలో ఈ తుపాకీని కూడా శుభ్రం చేశారు. ఈ క్రమంలో దాని సీరియల్ నెంబర్ బయటపడింది. దీంతో ఆసక్తి కొద్దీ ఆ సీరియల్ నెంబర్ ఎవరిదా? అని ఆరాతీయగా అది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్వాతంత్ర్యోద్యమంలో వాడినదని, దాంతోనే బ్రిటిషర్ ను కాల్చి చంపాడని తేలింది. దీంతో ఆంతా ఆనందాశ్చర్యాలకు గురయ్యారు.