: గూగుల్ లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఏడేళ్ల బాలిక.. రిప్లై ఇచ్చిన సుందర్ పిచాయ్
గూగుల్ లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఆ అభ్యర్థికి ఏడేళ్లు. అందుకోసం గూగుల్ హెచ్ఆర్‌కో లేదా ఆ కంపెనీ ఇతర ప్రతినిధికో దరఖాస్తు చేయలేదు. నేరుగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి తన అప్లికేషన్ పంపించింది ఆ చిన్నారి. ఆ దరఖాస్తును పరిశీలించిన సుందర్ పిచాయ్ సదరు అభ్యర్థికి రిప్లై ఇవ్వడం మరో విశేషం. వివరాల్లోకి వెళితే యూకేకు చెందిన క్లో బ్రిడ్జ్ వాటర్(7) గూగుల్ లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ చిన్నారికి ఇటీవలే గూగుల్‌లో పని చేయాలని ఆసక్తి కలిగింది. ఆ సంస్థలో జాబ్ తెచ్చుకుంటానని తన నాన్నతో ప్రతిరోజు అనేది. కూతురి కోరిక పట్ల ఆసక్తి చూపిన ఆమె తండ్రి బ్రిడ్జ్ వాటర్.. తన కూతురు గూగుల్ కు ఉద్యోగ అప్లికేషన్ ను పంపేలా సాయపడ్డారు.
ఆ దరఖాస్తులో ఆ చిన్నారి తనకు కంప్యూటర్లు, రోబోట్స్, టాబ్లెట్స్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. తన విద్యార్హతలు పేర్కొటూ స్కూల్లో కూడా తాను మంచి విద్యార్థినని తెలిపింది. గూగుల్లో వర్క్ చేయడమే కాకుండా, చాకోలెట్ ఫ్యాక్టరీలో పనిచేయడం కూడా తనకు ఇష్టమని, ఒలింపిక్స్ లో స్విమ్ చేయాలనే ఆసక్తి కూడా ఉందని చెప్పింది. దరఖాస్తు లేఖను అందుకున్న సుందర్ పిచాయ్, వెంటనే రిప్లై ఇస్తూ.. తమ సంస్థలో ఉద్యోగం దరఖాస్తు చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. రోబోట్స్, కంప్యూటర్లను ఇష్టపడటం తనకు ఎంతో సంతోషానిచ్చిందని పేర్కొన్నారు.. సాంకేతికత గురించి ఆ చిన్నారి మరింత నేర్చుకోవాలని సూచించారు. త్వరలోనే ఆ చిన్నారి తన డ్రీమ్స్ ను చేరుకోవాలని ఆకాంక్షించారు. స్కూలింగ్ పూర్తవగానే తమ సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.