: అన్నా డీఎంకేలో పళనిస్వామి ప్రస్థానం..!
తమిళనాడులో రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ పళనిస్వామి సీఎం కుర్చీపై కూర్చోనున్నారు. అన్నాడీఎంకే లో సీనియర్ నేత అయిన అరవై రెండు సంవత్సరాల పళని స్వామి రాజకీయ ప్రస్థానం ఇలా కొనసాగింది. సేలం జిల్లా సిరువన్ పాలెం ప్రాంతంలోని రైతు కుటుంబానికి చెందిన ఆయన, ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే లో చీలిక వచ్చినప్పుడు జయలలితకు మద్దతు తెలుపుతూ, ఆమె పక్షాన నిలిచారు. 1989లో జయలలిత వర్గం నుంచి ఎడప్పాడి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన, 1991,2011, 2016 ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి తన విజయపరంపర కొనసాగించారు.
2011లో రహదారుల శాఖ మంత్రిగా చేసిన ఆయన ప్రస్తుతం ప్రజాపనుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. కాగా, గతంలో కూడా పళనిస్వామికి సీఎం పీఠం దక్కినట్లే దక్కి దూరమైంది. జయలలిత మృతితో తమినాడులో రాజకీయ అనిశ్చితి నెలకొనడం, అనంతర పరిణామాల నేపథ్యంలో, శశికళ వర్గానికి చెందిన పళనిస్వామికి సీఎం స్థానం దక్కింది. ఈ రోజు సాయంత్రం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.