: అన్నాడీఎంకేకు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత కరుప్పుస్వామి పాండ్యన్!
అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవిని టీటీవీ దినకరన్ కు ఎలా కట్టబెడతారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో అన్నాడీఎంకే సీనియర్ నేత కరుప్పుస్వామి పాండ్యన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దినకరన్ నియామకాన్ని నిరసించిన ఆయన నిన్న విలేకరులతో మాట్లాడారు. 2011లో పార్టీ నుంచి దినకరన్ ను జయలలిత బహిష్కరించారని, అలాంటి వ్యక్తికి అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ కట్టబెట్టారన్నారు.
పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తికి రాత్రికే రాత్రి దానిని పునరుద్ధరించారని, ఆ మర్నాడే ఆయనకు ఈ పదవి కట్టబెట్టారని పాండ్యన్ మండిపడ్డారు. అందుకే, ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న అన్నాడీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పన్నీర్ సెల్వం నుంచి తనకు ఎటువంటి పిలుపు రాలేదని, ఒకవేళ పిలుపు వచ్చినా, ఇప్పట్లో ఆయనకు తన మద్దతు ప్రకటించనని పాండ్యన్ స్పష్టం చేశారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో గవర్నర్ నడచుకుంటున్న తీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు.