: పళనిస్వామికి రాజ్ భవన్ నుంచి పిలుపు.. రిసార్టు నుంచి కదిలిన సీఎం అభ్యర్థి
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో శశికళ నటరాజన్ జైలుకి వెళ్లడంతో తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఏర్పాటుపై ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు 11.30కి తనని కలవాలంటూ అన్నాడీఎంకే శాసనసభ పక్షనేత పళనిస్వామికి గవర్నర్ నుంచి పిలుపువచ్చింది. దీంతో గోల్డెన్ బే రిసార్టులో ఉన్న పళనిస్వామి అక్కడి నుంచి పలువురు మంత్రులతో కలిసి రాజ్‌భవన్‌కు బయలుదేరారు. ఈ భేటీ తరువాత ఇక ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ ఓ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పళనిస్వామికే ఆ అవకాశం ఇస్తారని అందరూ భావిస్తున్నారు.
నిన్న పళనిస్వామితో పాటు పన్నీర్ సెల్వంతో కూడా విద్యాసాగర్ రావు చర్చించిన విషయం తెలిసిందే. తనకి పార్టీలో మెజారిటీ ఉందని పళనిస్వామి గవర్నర్ తో ఆ సందర్భంగా తెలిపారు. మరోవైపు పన్నీర్ సెల్వంకి పార్టీలో అంతగా మెజార్టీ లేకపోవడంతో గవర్నర్ పళనిస్వామికే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.