: డీఎంకే పాచికలు ఫలిస్తే కరుణానిధి సీఎం... లేదంటే ఎన్నికలే: స్టాలిన్ ఎత్తులు
తమకున్న 89 మంది ఎమ్మెల్యేలకు తోడు కాంగ్రెస్, పన్నీర్ సెల్వం మద్దతుతో తమిళనాడులో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న డీఎంకే, అలా జరగని పక్షంలో ఎవరికీ మద్దతివ్వకుండా ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ద్వారానే డీఎంకే అధికారంలోకి రానుందని స్టాలిన్ ఇప్పటికే తన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత వరకూ ఎన్నికలు లేకుండా అధికారాన్ని పొందే యత్నాలు కూడా చేయాలని ఆయన సూచించారు.
అన్నాడీఎంకేలోని సీనియర్ నేతలకు వల వేయాలని, వారికి మంత్రి పదవులు ఆఫర్ చేద్దామని, కనీసం 10 మందికి పైగా ఎమ్మెల్యేలు డీఎంకే వైపు వచ్చేలా చూడాలని చెబుతూ, ఆ బాధ్యతలను కొందరు నేతలకు స్టాలిన్ అప్పగించినట్టు తెలుస్తోంది. ఓ పది మందిని ఆకర్షిస్తే, పన్నీర్ వర్గంలోని 10 మందితో కలిపి 118 మందితో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, కుదరకుంటే మాత్రం ఎన్నికలకు సన్నద్ధం అవుదామని స్టాలిన్ చెప్పినట్టు సమాచారం. కాగా, ఒకవేళ డీఎంకే ప్రభుత్వ ఏర్పాటు ఖరారైన పక్షంలో కరుణానిధే సీఎం అని కూడా స్టాలిన్ స్పష్టం చేసినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.