: పెళ్లి ఖర్చు రూ. 5 లక్షలు దాటిందా?.. పదిశాతం పన్ను కట్టాల్సిందే!
వివాహ సమయాల్లో పెరిగిపోతున్న దుబారా ఖర్చులను తగ్గించేందుకు సరికొత్త ప్రతిపాదన ముందుకొచ్చింది. ఇక నుంచి పెళ్లి ఖర్చు రూ. 5 లక్షలు దాటితే అందులో పదిశాతం ప్రభుత్వానికి పన్నుగా కట్టాల్సి ఉంటుంది. ఎంపీ పప్పు యాదవ్ సతీమణి, కాంగ్రెస్ ఎంపీ రంజిత రంజన్ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివాహ బిల్లు-2016లో ఈ మేరకు ప్రతిపాదన తీసుకొచ్చారు. వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయడంతోపాటు, వృథా ఖర్చును తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ప్రవేటు బిల్లుగా పరిగణించి వచ్చే లోక్‌సభ సమావేశాల్లో చర్చించనున్నారు.
తాజా వివాహబిల్లు ప్రకారం పెళ్లిలో రూ. 5 లక్షలకు మించి ఖర్చు చేయాలనుకునే వారు ముందుగా సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఖర్చు చేయాలనుకున్న మొత్తంలో పదిశాతాన్ని ముందుగానే ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రభుత్వ ఖజానాకు ఇలా సమకూరే మొత్తాన్ని సంక్షేమ నిధికి మళ్లిస్తారు. ఈ సొమ్మును పేద అమ్మాయిల పెళ్లిళ్లకు ఖర్చు చేస్తారు. ఇక పెళ్లి భోజనాల్లోనూ వృథా తగ్గించేందుకు బిల్లులో ప్రతిపాదన చేశారు. పెళ్లిలో కొత్త పోకడల కారణంగా వృథా ఖర్చులు పెరిగిపోతున్నాయని, ఇది పేదలకు మరింత భారంగా మారుతోందని రంజిత రంజన్ పేర్కొన్నారు. పెరిగిపోతున్న ఖర్చును తగ్గించాల్సిన అవసరం ఉందని, పెళ్లి జరిగిన రెండు నెలల్లోగా రిజస్టర్ చేయించాలని ఆమె తెలిపారు.