: కేన్సర్‌తో బాధపడుతున్న శునకం.. కీమో థెరపీ చేస్తున్న వైద్యులు!
రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న ఓ శునకానికి వైద్యులు కీమో థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు చెందిన సునీల్ కుమార్ గత ఎనిమిదేళ్లుగా పొమరేనియన్ జాతి కుక్కను పెంచుకుంటున్నారు. గత ఆరు నెలలుగా దాని ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అనుమానించిన ఆయన ఇటీవల సామర్లకోటలోని పశువైద్యశాలకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు కొన్ని మందులు ఇచ్చారు. అయితే వ్యాధి నిర్ధారణ కోసం కాకినాడ పాలీ క్లినిక్‌కు తీసుకెళ్లాలని సూచించడంతో సునీల్ అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు కృష్ణమూర్తి శునకాన్ని పరీక్షించి అది రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. దీంతో కీమో థెరపీ ద్వారా చికిత్స చేస్తున్నారు. రెండు నెలల్లో అది కేన్సర్ బారి నుంచి బయటపడి పూర్తి ఆరోగ్యంగా తయారవుతుందని డాక్టర్ కృష్ణమూర్తి తెలిపారు.