: నిప్పుతో చెలగాటమాడుతున్న భారత్: చైనా హెచ్చరిక
దక్షిణ చైనా సముద్రం, దలైలామా, తైవాన్ తో తమకున్న సమస్యలను ఇండియా తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోందని, ఇది నిప్పుతో చెలగాటమేనని చైనా హెచ్చరించింది. తైవాన్ పార్లమెంటరీ ప్రతినిధులతో భారత్ సమావేశం కావడాన్ని విమర్శిస్తూ, భారత్ రెచ్చగొట్టే పనులు చేస్తోందని, తైవాన్, చైనాల సమస్యను వాడుకుని లబ్ది పొందాలని చూస్తే, తీవ్రంగా నష్టపోవడం ఖాయమని చైనా అధికారిక పత్రిక 'గ్లోబల్ టైమ్స్', మరో దినపత్రిక 'పీపుల్స్ డైలీ'లు పేర్కొన్నాయి.
అమెరికా కొత్త అధ్యక్షుడు సైతం చైనా వ్యతిరేక విధానాన్ని వదిలేశారని, ఇండియా మాత్రం ఆ పని చేయడం లేదని ఆరోపించింది. 2016లో తైవాన్ లో త్సాయ్ ఇంగ్ సర్కారు ఏర్పడిన తరువాత, ఇండియాతో మరింత బలమైన బంధం కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తైవాన్ లో భారత ఎంబసీ లేకపోవడంతో ఇండియా - తైపీ అసోసియేషన్ మధ్యవర్తిగా రాజకీయ, వ్యాపార బంధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక 'వన్ చైనా పాలసీ' కారణంగా తైవాన్ తో సత్సంబంధాలను నెరపని చైనా, ఇండియా ఆ దేశానికి దగ్గరవుతుండటాన్ని జీర్ణించుకో లేకుండా ఉంది. ఇక తాము ఇండియాకు దగ్గరగా ఉండాలంటే, వన్ చైనా పాలసీపై నిబద్ధతను చూపాలని మోదీకి తమ ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని ఆ పత్రికలు పేర్కొన్నాయి. ఇండియాలో తైవాన్ ఇన్వెస్ట్ మెంట్స్ పెరిగితే, అది తమ ప్రభుత్వానికి ఆగ్రహాన్ని తెప్పించవచ్చని హెచ్చరికలు జారీ చేశాయి.