: హస్సీకి పట్టిన గతే నాకూ పడుతుందేమో!: ఆరోన్ ఫించ్
ఆరోన్ ఫించ్... ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్. ఇప్పటి వరకు ఆసీస్ తరపున 79 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. అయితే, ఒక విషయం మాత్రం అతడిని ఎంతగానో వేధిస్తోంది. వన్డేలు, టీ20 మ్యాచ్ లలో సత్తా చాటుతున్నా... తనకు ఇంత వరకు టెస్టుల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ హస్సీకి పట్టిన గతే తనకు కూడా పడుతుందేమో అంటూ తన మనసులోని మాటను ఫించ్ వ్యక్తం చేశాడు. హస్పీ కూడా అసీస్ తరుపున 69 వన్డేలు, 39 టీ20లు ఆడినా, టెస్టుల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో ఫించ్ మాట్లాడుతూ, తన ఆటతీరు ఎంతో మెరుగ్గా ఉందని, పరుగులతో రాణిస్తున్నానని... అయినా టెస్టుల్లో అవకాశం రాకపోవడం నిరాశకు గురి చేస్తోందని అన్నాడు.