: చీలిక దిశగా అడుగులు వేస్తున్న అన్నాడీఎంకే!


1972లో ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీ ఆయన మరణించిన తర్వాత రెండుగా చీలింది. ఒక వర్గానికి జానకీ రామచంద్రన్, రెండో వర్గానికి జయలలిత నాయకత్వం వహించారు. అయితే, తదనంతర పరిణామాలతో ఈ రెండు వర్గాలు మళ్లీ కలసిపోయాయి.   అప్పటి నుంచీ జయలలిత నాయకత్వంలో పార్టీ దిగ్విజయంగా కొనసాగింది. దివంగత జయలలిత దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు పార్టీని ఏకఛత్రాధిపత్యంగా నడిపించారు. అలాంటి అన్నాడీఎంకే ఇప్పుడు చీలిక దిశగా అడుగులు వేస్తోంది.

తనకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో, సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని శశికళ ప్రతిపాదించడం పార్టీలో చాలా మందికి నచ్చడం లేదట. పళనిస్వామిపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యక్తిని సీఎంగా చేస్తే, పార్టీ పరువు పోతుందని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు సమాచారం. అమ్మకు అత్యంత విధేయుడు, మచ్చలేని మనిషి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందని కొంతమంది ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, పార్టీ నుంచి జయలలిత వెళ్లగొట్టిన తన బంధువులకు... పార్టీలో కీలక పదవులను శశికళ కట్టబెట్టడం చాలా మందికి మింగుడు పడటం లేదు. పోయస్ గార్డెన్ నుంచి జయ తరిమేసిన తన మేనల్లుడు దినకరన్ కు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ కట్టబెట్టారు. ఇది చాలా మందికి రుచించడం లేదు. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలిపోనుందనే సంకేతాలు అందుతున్నాయి. అయితే, ఎవరెవరు, ఎవరెవరి వెంట ఉండబోతున్నారనే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

  • Loading...

More Telugu News