: షారుఖ్ ఖాన్ రావడం వల్ల తనకు నష్టం వచ్చిందట.. కేసు పెట్టిన వ్యాపారి!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. తన సినిమా 'రయీస్' ప్రమోషన్ లో భాగంగా రాజస్థాన్ కు వచ్చిన సందర్భంలో... కోటా రైల్వేస్టేషన్ వద్ద రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయని షారుఖ్ పై కేసు నమోదయింది. రైల్వే ప్లాట్ ఫామ్ మీద ఉన్న ఓ వర్తకుడు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన రైల్వే కోర్టు షారుఖ్ పై కేసు నమోదు చేయాలని రైల్వే పోలీసులను ఆదేశించింది. జనవరి 23వ తేదీన కోటా రైల్వే స్టేషన్ కు షారుఖ్ ఖాన్ రావడంతో, ఆయన అభిమానులు విపరీతంగా వచ్చారని... ఈ నేపథ్యంలో, స్టేషన్ మొత్తం ధ్వంసమయిందని సదరు వ్యాపారి ఆరోపించారు.
ఆగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్ ప్రెస్ బోగీ తలుపు వద్ద నిలబడ్డ షారుఖ్... జనాల్లోకి ఏదో విసిరాడని, దీంతో, దాన్ని పట్టుకోవడానికి అందరూ ఒక్కసారిగా అటువైపు వెళ్లారని... దీంతో, తన ట్రాలీ కిందపడిపోయి అందులో ఉన్న ఆహార పదార్థాలన్నీ ధ్వంసమయ్యాయని, తనకు గాయాలు కూడా అయ్యాయని విక్రమ్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో, షారుఖ్ పై ఐపీసీ సెక్షన్లు 427, 120(బి), 147, 149, 160ల కింద కేసు నమోదు చేశారు. వీటితో పాటు రైల్వే చట్టంలోని 145, 146, 3 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు.