: అప్పుడు, ఇప్పుడు తెలుగు గవర్నర్లే.. నాడు జయ, నేడు శశికళ!
తమిళనాట సంక్షోభాలకు.. తెలుగు గవర్నర్లకు ఎక్కడో విడదీయరాని సంబంధం ఉన్నట్టు ఉంది. అది కాకతాళీయమో, మరోటో కానీ తమిళనాట సంక్షోభం ఏర్పడిన ప్రతిసారి తెలుగు గవర్నర్లే అక్కడ ఉండడం కొంత ఆశ్చర్యం కలిగించే అంశం. అప్పట్లో జయలలిత జైలుకు వెళ్లేందుకు అప్పటి గవర్నర్ మర్రి చెన్నారెడ్డి కారణమైతే, నిర్ణయాన్ని జాప్యం చేయడం ద్వారా శశికళ ఆశలను వమ్ము చేసింది ప్రస్తుత గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు. ఇద్దరూ తెలుగు వారు కావడం, అందులోనూ తెలంగాణ వారు కావడం గమనార్హం.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై కేసు వేసేందుకు గవర్నర్ మర్రి చెన్నారెడ్డి అనుమతి ఇచ్చారంటూ ఏప్రిల్ 1, 1995లో అప్పటి జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి చెన్నైలోని తన కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. సీఎంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం దేశం రాజకీయ చరిత్రలో అదే తొలిసారి.
పలు పరిణామాలు, విచారణలు తర్వాత సెప్టెంబరు 27, 2014లో అక్రమాస్తుల కేసులో జయలలిత సహా శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, జరిమానాలు విధించింది. తీర్పు వెలువడిన రోజే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జయలలితోపాటు మిగతా వారినీ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. అలా జయ జైలుకు వెళ్లడానికి అప్పటి గవర్నర్ మర్రి చెన్నారెడ్డి కారణమయ్యారు.
ప్రస్తుతం నాటకీయ పరిణామాల నడుమ సీఎం పీఠం ఎక్కేందుకు సిద్ధమైన శశికళ ఆశలను, నిర్ణయాన్ని జాప్యం చేయడం ద్వారా గవర్నర్ విద్యాసాగర్‌రావు అడియాసలు చేశారు. 21 ఏళ్లపాటు పలు మలుపులు తిరిగిన అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. శశికళను దోషిగా తేలుస్తూ తీర్పుచెప్పింది. జైలు శిక్ష, జరిమానాతోపాటు, ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టు నిషేధం విధించింది.