: యూపీ ఎన్నికల్లో గెలిచేందుకు మోదీ వినూత్న ప్రచారం...ఇంటింటికీ లేఖలు
బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని ప్రతీ ఇంటికీ మోదీ రాసిన లేఖలు చేరుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర ఇబ్బందులపాలు చేసిన డీమోనిటైజేషన్ పై ఆ లేఖలో వివరించారు. అంతే కాకుండా, తన ఏకపక్ష నిర్ణయానికి మద్దతు తెలిపారంటూ ఆయన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ లేఖల్ని రోజూ 1600 మంది బీజేపీ కార్యకర్తలు, 2.75 లక్షల మంది ప్రజలకు అందజేస్తున్నారని యూపీ బీజేపీ తెలిపింది. డీమోనిటైజేషన్ వల్ల అవినీతి, నల్లధనాన్ని అరికడతామని, భవిష్యత్ లో ఎంతో మంచి జరుగుతుందని ఈ లేఖల్లో ప్రధాని పేర్కొన్నారు.
అంతే కాకుండా 2014 ఎన్నికల సమయంలో ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించారని, ఆ నమ్మకాన్ని ఇప్పుడు చేసి చూపిస్తున్నానని ఆయన తెలిపారు. అవినీతి, ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు 2జీ, అగస్టా, బొగ్గు కుంభకోణాలతో కోట్లకు కోట్ల ధనాన్ని దండుకున్నాయని ఆయన విమర్శించారు. ఆ డబ్బంతా ప్రజలదేనని పేర్కొన్న ఆయన... దానిని వెనక్కి తీసుకొస్తానని మరోసారి హామీ ఇచ్చారు. అలాగే దేశంలో నల్లధనమన్నది లేకుండా చేస్తానని ఈ లేఖల్లో పేర్కొన్నారు. యూపీలో ఏడు దఫాలుగా ఎన్నికలు జరగనుండగా, ఇప్పటికే ఒక దఫా పూర్తైంది. రెండో విడత పోలింగ్ బుధవారం 67 నియోజకవర్గాల్లో జరగనుంది.