: సంబంధాలు చెడితే మళ్లీ సంక్షోభం తలెత్తుతుంది: సురవరం
తమిళనాడులో పళని స్వామి, శశికళ మధ్య సంబంధాలు బెడిసికొడితే మళ్లీ సంక్షోభానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జయలలిత అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆమెను చూడనివ్వకపోవడంపైన, ఆ తర్వాత కేంద్రం వ్యవహరించిన తీరుపైన ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తమిళనాట సంక్షోభం ఇప్పుడు ముగిసిపోతుందని తాను భావించడం లేదని, మరో రూపంలో వచ్చే అవకాశముందని తన అనుమానం వ్యక్తం చేశారు.
తమిళనాడులో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజ్యాంగ బద్ధమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కాగా, గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసును మూసివేయడం చాలా బాధాకరమని అన్నారు. జయలలిత అక్రమాస్తుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు వెలువరించిన తీర్పును చూసైనా ఈ నిర్ణయం మార్చుకోవాలని అన్నారు. నయీమ్ గ్యాంగ్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉన్నట్లు అనిపిస్తోందని, ఈ కేసును సీబీఐకు అప్పగించాలని, అప్పుడే వాస్తవాలు బయటపడతాయని సురవరం అన్నారు.