: కోహ్లీ భారత్ కు వరం...కొత్త కెప్టెన్ కూడా ఇంగ్లండ్ ను అలాగే విజయపథంలో నిలుపుతాడు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీమిండియాకు విరాట్ కోహ్లీ వరమని ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తెలిపాడు. లండన్ లో వాన్ మాట్లాడుతూ, ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్ అలిస్టర్ కుక్ స్థానంలో వైస్ కెప్టెన్ జో రూట్ ను కెప్టెన్ చేయడం సరైన నిర్ణయమని అన్నాడు. కోహ్లీలా జోరూట్ లో అసాధారణ ప్రతిభ ఉందని చెప్పాడు. కోహ్లీ కెప్టెన్ అయిన తరువాతే డబుల్ సెంచరీలు చేస్తున్నాడని వాన్ గుర్తుచేశాడు. రూట్ కూడా కెప్టెన్ గా రాణిస్తాడని, అతను కెప్టెన్సీ చేపట్టేందుకు ఇదే సరైన సమయమని తెలిపాడు. బ్యాటింగ్ లో రాణిస్తూనే కెప్టెన్ గా కూడా సత్తాచాటాల్సిన బాధ్యత రూట్ పై ఉందని చెప్పాడు. ప్రస్తుత సారధులంతా ఇదే పంధా అనుసరిస్తున్నారని వాన్ చెప్పాడు. కోహ్లీ మాదిరిగా రూట్ కూడా ఇంగ్లండ్ జట్టును ఉన్నతస్థాయిలో నిలుపుతాడని, అతనిలో ఆ సత్తా ఉందని వాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు.