: వాటిని పట్టించుకోకుండా పదవులు, టిక్కెట్లు కావాలంటే కుదరదు: చంద్రబాబు
చిన్న ఎన్నికలను పట్టించుకోకుండా పదవులు, ఎన్నికల్లో టిక్కెట్లు కావాలంటే కుదరదని పార్టీ నాయకులను ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాల్లో సమన్వయం అవసరమని, ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఏ ఎన్నికల నైనా నేతలంతా సీరియస్ గా తీసుకోవాలని, పదవుల్లో ఉన్న వారు పార్టీ కోసం పని చేయడాన్ని ఘన కార్యంగా భావించ వద్దని సూచించారు.
ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ల, కార్మిక సంఘాల ఎన్నికలను టీడీపీ పట్టించుకోదనే భావనకు చరమగీతం పాడాలని అన్నారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకే కేటాయిస్తున్నామని, బీజేపీ అభ్యర్థికి అందరూ సహకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో మంత్రుల పర్యటనల వివరాలను చంద్రబాబు వివరించారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాల కోసమే కాకుండా సమన్వయం నిమిత్తమూ జిల్లాల్లో పర్యటించాలని టీడీపీ నాయకులకు చంద్రబాబు సూచించారు.