: బరువు తగ్గించే శస్త్రచికిత్సతో మధుమేహం సైతం దూరమవుతుందట!
మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల ప్రభావంతో స్థూలకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. స్థూలకాయంతో బాధపడుతున్న వారిలో అధిక శాతం మంది శస్త్రచికిత్స చేయించుకొని బరువుని తగ్గించుకోవాలనుకుంటున్నారు. అటువంటి వారికి అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రజ్ఞులు ఓ శుభవార్త చెప్పారు. బరువు తగ్గించే శస్త్రచికిత్సతో మధుమేహం కూడా దూరమవుతుందని పేర్కొంటున్నారు. స్థూలకాయుల్లో ఉండే కొవ్వు కణాలు (అడిపోసైట్స్) ఇతర కణాల జీవక్రియలను నెమ్మదింపజేసేలా సందేశాలను పంపుతాయని చెప్పారు. జన్యువుల నుంచి ఉత్పత్తయ్యే కొన్ని రకాల ప్రొటీన్ల చర్యలను అడిపోసైట్స్ నియంత్రించగలవని చెప్పారు. ఈ ప్రక్రియ టైప్-2 మధుమేహం బారిన పడడానికి దోహదపడుతుంది. ఈ శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించుకుంటే వారు టైప్-2 మధుమేహం బారినపడే అవకాశాలు తగ్గిపోతాయి. శరీరంలో అడిపోసైట్స్ కణ త్వచం ఉన్నవారు సాధారణ పద్ధతుల్లో బరువు తగ్గినప్పటికీ దాని దుష్ప్రభావం మాత్రం అలానే ఉంటుందట.