: సరబ్ జిత్ వ్యవహారంలో మరోసారి పాక్ కు భారత్ విజ్ఞప్తి
పాకిస్తాన్ జైల్లో తోటి ఖైదీల దాడిలో గాయపడి జీవచ్ఛవంలా మారిన భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ ను విడుదల చేయడమో, లేక, మెరుగైన చికిత్స కోసం మరో దేశానికి తరలించడమో చేయాలని భారత్ పొరుగుదేశానికి విజ్ఞప్తి చేసింది. అతని ఆరోగ్య స్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తోన్న భారత్ ఇక ముందు చేయబోయే ప్రతి ప్రయత్నమూ సరబ్ జిత్ ను ప్రాణాపాయం నుంచి బయటపడేసేదిగా ఉండాలని పాక్ కు సూచించింది.
మానవతా దృక్పథంతో సరబ్ జిత్ ను విడుదల చేస్తే భారత్ లోని మెరుగైన వైద్య సౌకర్యాల సాయంతో అతన్ని బతికించుకుంటామని.. ఈరోజు పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శిని కలిసిన భారత హైకమిషనర్ చెప్పారు. అంతేగాకుండా, ఓ మనిషి ప్రాణాన్ని కాపాడేందుకు దౌత్యపరమైన, న్యాయపరమైన కారణాలను సాకుగా చూపేందుకు ఇది సమయం కాదని కూడా ఓ ప్రకటనలో భారత వర్గాలు పేర్కొన్నాయి.