: కేసు వేసిందే నేను... అలాంటి పని నేనెందుకు చేస్తా?: సుబ్రహ్మణ్యస్వామి
ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు అవసరమైన బలం కలిగిన శశికళకు ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం కల్పించాలంటూ తమిళనాడు తాత్కాలిక గవర్నర్ ను బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కోరిన సంగతి తెలిసిందే. ఆమెను ఆహ్వానించకపోతే కోర్టులో రిట్ పిటిషన్ వేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. శశికళకు తాను మద్దతు తెలిపానంటూ అందరూ తనను విమర్శిస్తున్నారని... అసలు ఈ అక్రమాస్తుల కేసును వేసిందే తానని... అలాంటప్పుడు ఆమెకు తాను ఎందుకు మద్దతు తెలుపుతానని ప్రశ్నించారు.
మెజారిటీ ఉన్న నేతను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడం గవర్నర్ విధి అని... అదే విషయాన్ని తాను చెప్పానని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. ఇదే సమయంలో ఎవరైనా అక్రమాస్తులు కలిగి ఉండటం నేరమని... అందుకే వీరిపై తాను కోర్టులో న్యాయ పోరాటం చేశానని చెప్పారు. తనను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.